నెత్తురు కధ గురించి - కొడవటిగంటి కుటుంబరావు
"..కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం. ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది "నెత్తురు కధ". అయిదు పేజీలు పూర్తిగాలేని ఈ కధలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉంది. .....ఇంటి వరండాలో ఎత్తున కూర్చ్చున్న ఓ ముసల్ది చచ్చింది. ఆ ఫొటొ మనలో కొందరం చూశాం. వరండాలో అయిన రక్తం మడుగుమీద పిచ్చేశ్వరరావు కాల్షియం ఇంజెక్షన్‌లాటి కధ రాశాడు".
"..కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం. ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది "నెత్తురు కధ". అయిదు పేజీలు పూర్తిగాలేని ఈ కధలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉంది. .....ఇంటి వరండాలో ఎత్తున కూర్చ్చున్న ఓ ముసల్ది చచ్చింది. ఆ ఫొటొ మనలో కొందరం చూశాం. వరండాలో అయిన రక్తం మడుగుమీద పిచ్చేశ్వరరావు కాల్షియం ఇంజెక్షన్‌లాటి కధ రాశాడు".
నెత్తురు కధ
ఆఁ. అదే ఎర్ర జండా.
సుత్తి లేదు, కోడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ. రంగేసిన గుడ్డ కాదిది.నెత్తురు పులుముకున్న గుడ్డ. నీలా నాలా బ్రదికిన మనిషి నెత్తురు. ఒకప్పుడు- నీ రక్తంలా, నా రక్తంలా ప్రేమతో పొంగి, దుఃఖంతో కరిగి,క్షోభతో కుమిలి, కోపంతో మండి..న నెత్తురు.
ఆ రక్తంలోనూ యెర్ర కణాలు యీదినయి. ఆ రక్తంలో యెర్ర కణాలు పరుగెత్తినయి.
ఏవరో పంచిపెట్టిన రక్తంగాదు అది. పొలం దున్ని, కాయ కష్టం జేసి, పంటలు పండించి, సుఖంగా బ్రతికిన రైతులే ఆ రక్తానికి జీవం పోసింది; ఆ శరీరాన్ని పెంచింది. నీలా, నాలా, - ఆ రక్తాన్ని సొంతం చేసుకున్న శరీరం ఊయ్యాలల్లో ఊగింది. తల్లి రొమ్ము పాలు తాగింది. తండ్రి వొడిలొ గంతులేసింది. మాయా మర్మము; కల్లాకపటము తెలియకుండా రాత్రిళ్ళు నిద్రపోయింది; రేపటి సంగతి తెలియకుండా వుత్సాహంతో వూగిపోయింది. సంతోషంతో కేరింతలు కొట్టింది. ఆనందంతో ఆటలాడి పాటాలు పాడుకొంది.
పలకా బలపమూ పుచ్చుకొని బళ్ళోకెళ్ళింది. పంతులుగారు బెత్తం ఝలిపిస్తే గడ గడ వణికిపొయింది.పంతులుగారు పుస్తకం పట్టుకుంటే పాఠం గడగడ వప్పచెప్పింది.
పెళ్ళినాడు భర్తపేరు చెప్పేందుకు సిగ్గుతో వంగిపొయింది. చెరువులో నీళ్ళు తెచ్చెందుకు భర్త కావడేసుకుని, రొమ్ము విరుచుకుంటు బయలుదేరితే వుబ్బితబ్బిబ్బయ్యింది.
నువ్వూ, నేను గాంధిగారి ఫొటో చూడకముందు తన యింట్లో గాంధీ పటాన్ని వ్రేలాడగ ట్టింది. రాములవారి పటాన్ని పూజించినట్లు పూజించింది.
నువ్వూ, నేను ఖద్దరంటూ వొకటుందని తెలుసుకోక పూర్వమే, రాట్నం వడికింది. ఇంటిల్లపాది ఖద్దరు కట్టేట్టు చేసింది.
నువ్వు నేను చూడని జైళ్ళలోకి హత్యలు చేనవాళ్ళూ, దొంగతనాలు చేసినవాళ్ళూ, వాళ్ళల్లాంటి వాళ్ళు వెళ్ళేప్పుడు భర్త చేతికి "రా ట్నం జండా" యీచ్చి, భర్త నుదుట కుంకుమ బొట్టు పెట్టి హారతిచ్చి , కళ్ళంట నీళ్ళు పెట్టుకోకుండా భర్తని జైలు గేటుదాకా సాగనంపి వచ్చింది.
ఆరేళ్ళు పెరిగిన కొడుకు "అమ్మా! నానేప్పుడొత్తాలే?" అని అడిగి ఏక్కెక్కి యేడిస్తే ఆ రక్తం ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? "యీ లాటీలు పుచ్చుకున్నవాళ్ళ రాజ్యం పోయినప్పుడు వస్తారు బాబూ!"అని చెప్పింది. "తెల్లవాళ్ళ రాజ్యంపోయి మనవాళ్ళ రాజ్యంవచ్చినప్పుడు వస్తారు బాబు!" అని చెప్పింది.
వరదలొచ్చి పంటలుపోతే, వెన్నంటుకున్న బిడ్డల కడుపులుచూచి కుమిలిపోయింది..."చౌరమ్మా!చౌరమ్మా! నేనన్నట్టు వొప్పుకుంటే నీ పొలమూ నీకు దక్కుతుంది, నీ బిడ్డలూ నీకు దక్కుతారు. లేకపొతే..." అని జబల్‌కర్ గుటకలు మింగుతుంటే, యీ రక్తం యేం చేసిందో తెలుసా? రోకలిబండ పుచ్చుకుని " చీ! చచ్చినాడా" అని జీవంలేని చేతులు వూపింది. పదునులేని పళ్ళు నూరింది. రక్తంలేని కళ్ళు వురిమింది.
పెగలని కంఠంతో ఇంకేమో మాట్లాడబోయి శొ్‌షొచ్చి కూలింది.
భర్త జైలునుండి బయటపడి వచ్చేప్పటికి పొలం పోయింది. ఇల్లు పోయింది. వళ్ళు గుల్లయింది. అయినా, కళ్ళ్లో పెట్టుకున్న ప్రాణాలతో ఎదురెళ్ళింది. జరిగిందంతా విని భర్త నీరైపోతే యీ రక్తం యేమనందో తెలుసా? "అయిందేదో అయింది. అట్లాంటి కాలం యిట్లాగే వుంటుందా? గాంధిబాబు స్వరాజ్యం తెస్తాడు. అప్పుడు యెవరి సొమ్ము వాళ్ళకే వస్తుంది" అన్నది. "బొంబాయి వెళ్ళి యే మిల్లులో కుదిరినా మన మూడు డొక్కలూ నిండుతయిలే. దిగులు పడకు!" అని దిటవు చెప్పింది. జీవం లేని నవ్వు నవ్వింది.
చిరుగులుకుట్టిన కోక కట్టుకుని కోడలు యింట్లో అడుగుపెడితే గుడ్లలో నీళ్ళు కక్కుకుంది. కొంగుతో కళ్ళు తుడుచుకుని, కోడలు గడ్డం పుచ్చుకుని ఈ రక్తం ఏమన్నదో తెలుసా? " ఇట్లాంటి కాలం యిట్లాగే వుంటుందా? నీ కోడలు రాకముందే స్వరాజ్యం వస్తుంది. నీ కోడలు లంక్షిదేవికిమల్లే వస్తుంది. నా మనవళ్ళు రాజులకిమల్లే బ్రతుకుతారు" అని అన్నది.
భర్త గుండేల్లో గుండు దూరిందని వార్త వచ్చింది. తన చేతుల్తో తనే సాగనంపింది భర్తను; "చౌరీ! జైలుకెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నయే" అంటే యీ రక్తం అనందంతో పరుగెత్తింది. "ఆప్పుడు నీ మొఖాన కుంకుం పెట్టాను. ఇప్పుడేమి పెట్టి బొట్టు పెట్టను? కాండబ్బంత కుంకం కూడా లేకపొయె యింట్లో. హారతి మాట అనుకోవడానికి గూడా..." అంటూ బేజారయిపోయింది యీ నెత్తురు. "పిచ్చిదానా...!" అంటు భర్త తల మీద చేయివేసి నిమురుతుంటే చిన్నప్పుడు తండ్రి మొకాళ్ళమీద గుర్రం తొక్కుతున్నట్టులు వుబ్బి తబ్బిబ్బయింది. ఆ మాటలన్ని గుర్తుకొచ్చాయీ.
అయినా పిండి నూరే చేతుల్లొకి ప్రవహించుతూనే వుంది యీ రక్తం. ఈ చేతులు నూరిన పిండి పెనంమీదకి యెక్కుతూనే వుంది. కాలిన చపాతీలు కాలేజి కుర్రాళ్ళు బోటులోకి జేరవేస్తునే వున్నారు. బోట్లు నీళ్ళళ్ళో నిలుచున్న ఓడలవైపుకు పరుగెత్తుతూనేవున్నవి. ఓడలలోవున్న నావికుల ప్రాణాలు నిలబడినై. యెవరో "వాళ్ళందరూ గూండాలు" అన్నారని ఎవరో వచ్చి చెప్పితే యీ రక్తం నిండార్లయ్యింది.
"తెళ్ళాల్లేనా అన్నది!" అని వెర్రినవ్వు నవ్వింది యీ రక్తం. కోపంతో సలసల కాగిపోయింది యీ రక్తం...
మనవళ్ళని చూచి మురిసిపోయింది యీ రక్తం... "వచ్చే కాలం మీదేరా బాబూ!" అని గోరువెచ్చబడిందీ రక్తం.
మూడు రోజులు పస్తుండి ఆగస్టు పదిహేను పండుగ చేసుకుంది. మనమళ్ళతోనూ, కొడుకుతోనూ, కోడల్తొనూ పట్టణమంతా పిచ్చెత్తినట్లు తిరిగింది ఆనాడు. "అమ్మా! ఆవాళ్ళాది రాట్నం జండా, ఈవాళ్ళది చక్రం జండా" అని కొడుకంటే, చెప్పించని చదువు గుర్తుకొచ్చింది ఈ రక్తానికి.
నూలులేని బట్ట ఎక్కడుంటుంది? ఐనా తిండిలేని రక్తం ప్రవహిస్తూనే వుంది. తిండి కోసం చీపురు పట్టింది., వీధులూడ్చింది...కలిగినవాళ్ళ బిడ్డలు తినిపారేసిన కాగితాలు పొట్లాలూడ్చి గంపలకెత్తింది. మనమళ్ళ మాటన్న తల్చుకోకుండా కొడుకు తోలే బండిలో గుమ్మరించింది. భవనాల్లో వుండేవాళ్ళకి జబ్బులు పుడతాయని భూమ్మీద పండుకుని అకాశాన్ని కప్పుకుని బ్రతుకుతు భవనాలముందు దుమ్ము వూడ్చింది. వున్నవాళ్ళ కారుల టైరులు పోతాయని, కోడలి చేయి పుచ్చుకుని గుర్రాల బళ్ళు పారేసిన పేడకళ్ళేత్తింది యీ రక్తం!
ఈ బజార్లలో యీ చెత్తా, యీ చెదారమూ ఎందుకు పోగుపడిందో తెలుసా? వీటిని యేత్తిపారేసే చేతుల్లో రక్తం నీళ్ళైపోయింది. రక్తం నీళ్ళైపొయేటప్పటికి చేతులు "పనిచేయం" అన్నయి. కాళ్ళు"కదలం" అన్నయి. కళ్ళు "చూడం" అన్నయి. అన్నీ కలిసి "రక్తం కావాలి" అని అరిసినవి...
కాగితాలమీద కలాలు నడిచినయి. కాగితాలు చేతుల్లొ కదిలినయి. నలిగి, నలిగి, చిరిగిపోయినయి. చిరిగిపోయి చిత్తుబుట్టల్లో దూరినయి. అయినా "రక్తం" కనిపించలా. చిత్తుబుట్టలు దులిపేందుకు కూడా కనబడకుండాపోయింది.
ఏమైపోయింది? ఎక్కడి కెళ్ళిందీ రక్తం? తెళ్ళాల్ల రాజ్యం పోయింది. మనాళ్ళ రాజ్యం వచ్చింది. నాన్నలేడు, కొంప లేదు, తిండి లేదు, బట్టలేదు. జబల్‌కర్ నెత్తిమీద గాంధి టోపీ వుంది; జబల్‌కర్ ముడ్డికింద అస్సెంబ్లీ కుర్చి వుంది. పోలిసొళ్ళ చేతుల్లొ లాఠిల్లేవు. తూపాకులు వెలసినయి. "అమ్మా,తెళ్ళాల్ల రాజ్యం పోయిందే! మనాళ్ళా రాజ్యం వచ్చిందే అమ్మా!" అని కొడుకంటూటే "విందాం" అని చెవుల్లో పరిగెత్తిందీ రక్తం.
"అత్తా!...ఇంకేంతకాలం? సొరజ్జం వచ్చింది. కోడలు రాలేదు. చిరుగులుపడ్డ కోకలో కోక పోయింది. ఇంకెతకాలమత్తా?" అని కోడలు రక్తాన్ని ఖాండ్రిస్తే, "అయ్యొ" అని అదరా బాదరా కళ్ళలోకి పరుగేత్తిందా రక్తం.
"ఆ వూసిందిగూడా నువ్వే ఎత్తెయ్యలి. వుయ్యబాక!" అని కొడుకు యెకిలినవ్వు నవ్వుతూంటే యేం చెయ్యాలో అర్ధంగాక, యెటు పరుగెత్తాలో అర్ధంకాక అట్లాగే నిలబడిపోయింది ఆ రక్తం.
అప్పుడా రక్తానికి ఏమి తెలియలా. పట్టణంలొ పట్టణారోగ్యం పాడైపొతుందని విలపించే పత్రికలున్నాయని తెలియలా. కాంగార్ మైదానంలో "తిండి కావాలి" అని అరిసే గొంతులూ వినిపించలా. చీపుర్లు పట్టే చేతులు దుమ్మూ, దుమారమూ దులుపుకున్నవనీ తెలియలా. పదమూడువేల వంగిన నడుములు ఒక్కసారి లేచి నిలబడ్డాయని తెలియలా. బిడ్డా, పాప, అడా, మగా అందరు కలిసి బజార్లోకి వచ్చారని, యీసారి వచ్చింది చెత్తా చెదారమూ కదిపేందుకు కాదనీ, యీ సారి వచ్చింది వాళ్ళ నోళ్ళు అప్పు పుచ్చుకొని "తిండి కావాలి" అని అరిసే నాయకుల్ని పొట్టనపెట్టుకున్న రాతిగొడల్ని కదిపేందుకనీ తెలియలా...
ఎవరు సహిస్తారు యీ "సోమరితనాన్ని?" "పనిలేని జీతం" కావాలనేవాళ్ళన్నీ, "జీతమున్న శెలవులు కావాలనే వాళ్ళన్ని"? నువ్వు నేనూ సహించవచ్చు, సానుభూతి చూపవచ్చు, సమర్ధించవచ్చు,బలపర్చవచ్చు, పోట్లాడవచ్చు...
శాంతి భద్రతలు మేల్కోన్నాయి. ఇంతవరకు నిద్రపోతున్న శాంతి భద్రతలు మేల్కొన్నాయి. ఒక్కసారి ఆవులించాయి. కభందుడిలా ఒక్కసారి వళ్ళు విదుచుకున్నాయి. తరువాత జరిగే సంగతి నీకూ తెలుసు!
పోలిసుల చేతుల్లో తుపాకులు ఫెళ ఫెళ మన్నాయి. తుపాకుల బయట గుళ్ళు బుంయి మంటూ పరుగెత్తాయీ. మనోవేగంతో పరుగెత్తాయి. రక్తాన్ని పలకరించబోయాయి.
ఏమీ తెలియని రక్తానికి అంతా అర్ధమైంది. సలా సలా కాగింది. జల జలా పారింది...వరండా అంతా తడిసింది. గుడ్డలు నానినయి ఆ రక్తంలో...
అది యీ రక్తం! అలాంటిదీ...యీ రక్తం. ప్రేమతో పొంగి, దుఖంతో కరిగి, క్షోభతో కుమిలి, కోపంతో కమిలి...న నెత్తురు.
ఆ రక్తంలోనూ తెల్ల కణాలు యీదినయి. ఆ నెత్తురులోనే ఎర్ర కణా లూ పరుగెత్తినయి...
* * *
కృష్ణా జిల్లా లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1925 ఏప్రిల్ 12న జననం. 1945లో భారత నౌకాదళంలో చేరారు. కొన్నాళ్ళు "విశాలంధ్ర" లో. తరువాత ఆరు చిత్రాలకు మాటలు వ్రాసారు. గొదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, గాడిద ఆత్మకధ వంటి ప్రసిద్ధ అనువాదాలు వారివే. 1966 సెప్టెంబర్ 26 న చనిపోయారు.
3 comments:
తెలుగు కథ అంటే ఆసక్తి కలిగేలా చాలా బాగా రాశారు. ముఖ్యంగా చెప్పిన భాష వ్యావహారికం కాకపోయినా, ఎక్కడా ఆగనీయకుండా చదివించిన కథ ఇది.రచయితకు నా అభినందనలు.
సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్న చాలామందికి ఇదే గతి. అవకాశవాదులు ఆతరువాత ఎమ్మేల్యేలు, ఎంపీలు, కాకపోతే ధనవంతులు అయ్యారు.
కథ అద్భుతంగా ఉంది. కథను అందించినందుకు కృతజ్ఞతలు.
Post a Comment