ఆ తల్లి పిల్లల్ని పోషించే విధిని నిర్వహించలేనట్లే, ఈ "పెద్ద మనిషి" సాంఘిక చైతన్యానికి దారి చూపలేడు.
సంఘంలో చైతన్యం కలగాలంటే, సృజనాత్మక రచనలు కావాలి. సృజనాత్మక రచనలు, సంఘంలో చైతన్యాన్ని విద్యుద్దిపించాలాంటే, సాంఘిక సంసృతీ సంప్రదాయాలు అందులో సంలీనం కావాలి. మన సాంఘిక ప్రాచీన జీవితంలోని చచ్చుపుచ్చుల్ని దులిపి, కడిగి, యేరి, సజీవభాషనూ, రూపాల్ని, సాంకేతికాలనూ స్వీయం చేసుకోవాలి. అప్పుడుగాని ప్రజల హృదయతంత్రుల్ని మీటి సంగీతాన్ని పలికించలేము.
ఈనాడు గలగల తొణికే విషాదాశ్రువుల్ని , కణకణ మండే విలాపాగ్నూలని, సాహిత్య రూపాల్లో సాక్షాత్కరింపజేసుకోవాలి. దారిద్ర్యాలను పరిష్కరిస్తూ, దౌర్జన్యాలను బహిష్కరించే బాటలకు రూపులు దిద్దాలి.
వ్యదార్థజీవితాల యధార్ధాన్ని చిత్రిస్తూ, సంఘానికి భవిష్యత్తు చూపే సోపానాలను నిర్మించుకుంటూ సంఘం అంతా హర్షాన్ని పూచేట్లు చేసుకోవాలి.
అదే ప్రజా సాహిత్యం. ప్రజాసామాన్యం అంతా నిరక్షరాస్యులుగా వున్న మధ్య యుగాలలో గూడా ఉత్తమ సాహిత్య రూపాలు ప్రసిద్ధి కెక్కాయి. ఆ నాటికి నియమితమైన సాహిత్య చైతన్యంతో, ప్రజాజీవితాన్ని తరచి, ప్రజలిని కలవరపరచిన సమస్యల్ని వారి హృదయాలకు హత్తుకునేట్లు చిత్రించిన సంస్కృతీ రూపాల్నీ, ఈ నిరక్షరాస్యులైన ప్రజలే అత్తారు బలంగా దాచుకుని, ఆనందించారు; ఈనాడు అంతే.
No comments:
Post a Comment