Sunday, September 27, 2009

స్వాతంత్ర స్వరూపం - రచన "శారద"

ఒకప్పుడు, ఒక పిల్ల దేశం ఇంకోపెద్దదేశం నించి నానా అవస్థలు పడి స్వతంత్రం సంపాయించింది.  ఆ పిల్లదేశంలో ప్రజలు స్వతంత్రం వొచ్చినందుకు గుర్తుగా ఓ స్వతంత్ర విగ్రహం చేయించి రాజధాని నగరంలో  ప్రతిష్టించుదామని తమ స్వతంత్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం కూడా తమ ప్రజల ఆలోచన బాగానే వుందని ఒప్పుకుని, ఒక శిల్పిని పిలిపించింది.  ఆ శిల్పి అఖండమైన కళోపాసకుడు.  అదివరకు చాలా విగ్రహాలు చేశాడు.  అతను చేసిన విగ్రహాలు జీవకళ వుట్టిపడుతూ ఉండేవి.  ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఆ శిల్పి ఒక సుముహుర్తంలో, మంచి చలువ రాయితో విగ్రహం చేసేందుకు వుపక్రమించాడు.                                                                                                                                            


 "శారద" - ఎస్. నటరాజన్
స్వతంత్రాన్ని ప్రజలు పోరాడి తెచుకున్నారు గనుక, స్వతంత్ర విగ్రహం, తమ పోరాటాల చరిత్రని ఎల్లప్పుడు  జ్ఞప్తిచేస్తో, తమ సుఖవంతమైన స్వతంత్ర భవిష్యత్తును చూపుతూ వుండే ఒక మహా వీరుని విగ్రహంగా  చెక్కమని వాళ్ళు శిల్పికి తీర్మానాలు చేసి పంపారు.  శిల్పి అలాగేనని ఒక మహావీరుని విగ్రహం చెక్కడం ప్రారంభించాడు. 
కాని మొదట్నుంచీ, సామాన్య ప్రజల పోరాటాలు చేసి స్వతంత్రం  సంపాయిస్తే తమ ప్రాబల్యం ఎట్టాగు మంటగలుస్తుందని భయపడుతూ వచ్చిన డబ్బు స్వాములు, తమ మీద అధికారం చెలాయిస్తున్న పరాయిదేశం డబ్బు స్వాములతో గుసగుసలూ, వికవికలూ చేసి, అధికారం తమ హస్తగతం చేసుకున్నారు.  ఈ  డబ్బుస్వాములు, "స్వతంత్ర విగ్రహం" ప్రజలకి నూతనంగా వచ్చిన స్వతంత్ర ప్రభుత్వం యెడ నమ్రత, విదేయతా నేర్పే చిహ్నంగాను, అల్లరి ఆగం చేయకూడదని బోధించే గురువు లాగుండాలి.  అందుకని ఆ విగ్రహం ఓ ప్రశాంత తపస్విలాగానో లేక సన్యాసిలాగో ఉండాలి" అని శిల్పిని అజ్~నాపించారు.  శిల్పి "చిత్తం" అని మహావీరుడి విగ్రహం చెక్కినంతవరకు ఆపి, దాన్నే ఓ సన్యాసి రూపంలోకి చెక్కుతున్నాడు. 

ఆ దేశంలోని డబ్బుస్వాములల్లోనే ఇంకా కొందరు మహత్ములు, దేశాన్ని, దాని ఆర్ధిక పరిస్థితిని తమ జేబుల్లోను,
భోషాణాల్లోను ఇరికించుకొని వున్నారు.  వాళ్ళకి ఈ సలహాలేవి నచ్చలేదు.  వాళ్ళందరు కలిసి, "ఆ విగ్రహం, అ మన విశాలమైన దేశం యొక్క స్వతంత్ర వ్యాపర ప్రతిపత్తిని విస్తరింపజేసేదిగా ఒక గొప్ప ఓడల వర్తకుని రూపంలో వుండాలి" అని ఆ శిల్పికి ఆదేశం పంపారు.  శిల్పి ఆ ఆదేశం వెనుక వుండే ఆర్ధిక లాభాన్ని వూహించుకుని "అలాగే బాబు" అని తను తయారుచేస్తున్న సన్యాసి విగ్రహాన్నే గొప్ప వ్యాపారస్తుడి విగ్రహంగా మారుస్తున్నాడు.

కాని అసలు ప్రభుత్వంలో వుండే అ ప్రముఖులు ఇవన్ని పనికిరావని రెండు మూడు సబ్ కమిటీలు, నాలుగైదు విచారణ సంఘాలువేసి, వాటి రిపోర్టులన్ని కలేసి చదివి, వాటనన్నిట్నీ తీసేసిం తర్వాత "స్వతంత్ర విగ్రహం" ప్రభుత్వం ఎడ భక్తిని, నమ్రతని నేర్పేట్టు వుండవలసిందే కాని అది సన్యాసి లాగు ప్రజలకి నీరసం బోధించేట్టు ఉండరాదు. అది ప్రజలకి ప్రభుత్వం యెడల భయము, భక్తిని, శ్రద్దా, గౌరవాల్ని నేర్పే సాయుధ సైనికుడి విగ్రహంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.  నిజమైన ప్రజాశాంతిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రభుత్వ సైన్యమే.  అదీ కాకుండా ప్రజలలో కొందరు ఎల్లప్పుడూ ఆకలని, గుడ్డలని అల్లర్లు చేస్తో ఆర్ధిక సమానత్వం అని లేనిపోని ప్రచారం చేస్తో, ప్రజల ప్రశాంత జీవితాల్నీ భగ్నం చేస్తున్నారు.  అటువంటి వాళ్ళకి స్వతంత్ర విగ్రహం ప్రభుత్వం లో నైనా వాళ్ళ ఆటలు సాగవని హెచ్చరికలుతెల్పుతూ "స్వతంత్ర విగ్రహం"  ప్రభుత్వ సాయుధ సైనికుడి రూపంలో వుండాలి" అని బహిరంగ ప్రకటన ఒకటి చేసి శిల్పికి హుకుం ఇచ్చారు, సైనికుని విగ్రహం చెక్కమని.  "అట్లానే" అని శిల్పి తను ఇదివరలో చెక్కుతున్న వర్తకుడి రూపాన్నే సాయుధ సైనికుని రూపంలోకి మార్చుతున్నాడు.  ప్రభుత్వం సలహాని డబ్బు స్వాములు  హర్షించారు.  వ్యాపారస్తులు అహ్వానించారు.  అటూ ఇటూ మాట్లాడే పెద్దమనుషులు అమోదించారు.  ప్రజలు మాత్రం ప్రభుత్వ ధోరణికి ముక్కుమీద వేలేసుకున్నారు. 

అయితే, శిల్పి మాత్రం ఎడతెరిపి లేకుండా శ్రమించి స్వాతంత్ర విగ్రహాన్ని తయారుచేసాడు.  ఒక సుదినమున స్వాతంత్ర విగ్రహాన్ని రాజధాని నగరంలో ప్రతిష్టించడానికి తీసుకువచ్చారు.  అదివరకే తయారైన శిలావేదికపై స్వతంత్ర విగ్రహాన్ని వుంచారు.  ప్రభుత్వ అధ్యక్షుడు, స్వతంత్రాన్ని గూర్చి ఒక మహోపన్యాసం జేసింతర్వాత స్వతంత్ర విగ్రహానికి వున్న ముఖమల్ గుడ్డని  తోలగించాడు.  స్వాతంత్ర  విగ్రహం ఆధునిక ఆయుధాలతో సాక్షాత్కరించింది.  భయంకరమైన దయ్యం రూపంలో -
*

సూచిక:  ఇటీవలి కాలం లో "శారద" సాహిత్యం పునర్ముద్రణ కి నోచుకోలేదు.  "శారద" సాహిత్యాన్ని మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కధని ఇక్కడ ప్రచురించడం జరిగింది.  శ్రీ అరి సీతారామయ్య గారు ఇచ్చిన వివరాలతో, తెనాలి లోని  శ్రీ వర్ధనరావు గారిని (English Lecturer (Retd), V.S.R College, Tenali)  రక్తస్పర్శ  ("శారద" కధల సంకలనం) గురించి ఆరాతీస్తే వారికి కూడా వివరాలు తెలియవని అన్నారు.  చాలా మంది మిత్రులని, సాహిత్యాభిమానులని, ప్రచురణకర్తలని కూడ సంప్రదించడం జరిగింది.  సంప్రదించిన వారు ఎవరూ కూడ పూర్తి వివరాలు ఇవ్వలేక పొయ్యారు.    ప్రజాసాహితి మాసపత్రికలో (ఆగస్టు 2009) ఈ కధ ని ప్రచురించారు.  సంపాదకులు శ్రీ కొత్తపల్లి రవిబాబు గారి అనుమతితో ఈ కధని ఇక్కడ ఉంచడం జరిగింది.  దీనిమీద నాకు ఎటువంటి హక్కులు లేవు.
*

* ఈ కథను వ్రాసింది "శారద" ( ఎస్. నటరాజన్)::ప్రచురణ: :  విశాలాంధ్ర దిన పత్రిక ::జూలై, 1948
శారద చాయాచిత్రం: కీ.శే. ముమ్మనేని నాగేశ్వర రావు, తెనాలి 

1 comment:

SRRao said...

oka samaanya jeevithamlonunchi vacchina viluvaina kathalu sarada kathalu. marosari gurtuchesinanduku krutajnatalato......